Thursday 26 December 2019

ఈ బ్లడ్ నిజంగా బంగారమే... (Golden Blood)


రక్తం అంటే మనకు ప్రాణాధారం. మన ఒంట్లోని అణువణువుకూ జవజీవాలతోపాటు ప్రాణ వాయువును అందించే అపురూపమైన సంజీవిని. అందుకే రక్తదానాన్ని మనం ప్రాణదానంగా పేర్కొంటున్నాం. ఇక మన రక్తంలో ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులు ఉంటాయని మనకు తెలుసు. వీటిలో అరుదైన బ్లడ్ గ్రూపు ఏదంటే వెంటనే మనలో చాలామంది ఓ గ్రూపు అని ఠక్కున చెప్పేస్తారు. ఇంకాస్త అవగాహన ఉన్నవాళ్లైతే... బాంబే బ్లడ్ గ్రూప్ అని చెబుతారు. కానీ వీటికన్నా అరుదైన బ్లడ్ గ్రూప్ మరోటి ఉంది. దాని పేరే గోల్డెన్ బ్లడ్. పేరుకు తగ్గట్టుగానే అది నిజంగా బంగారమే. 
బంగారంలాంటి ఈ రక్తం ప్రపంచంలో ప్రస్తుతం కేవలం 43 మంది వ్యక్తుల్లో మాత్రమే ఉందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇదెంత అరుదైన గ్రూపు రక్తమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గోల్డెన్ బ్లడ్ కలిగిన వ్యక్తులు ఓ గ్రూపు వ్యక్తుల్లాగే అందరికీ తమ రక్తాన్ని దానం చేయొచ్చు. కానీ వీరికి రక్తం అవసరమైనపుడు మాత్రం దాతలు దొరికే పరిస్థితి ఉండదు. కాస్త కష్టమైనా ఓ గ్రూపు రక్తాన్ని ఎక్కడి నుంచైనా పట్టుకు రావొచ్చేమోగానీ... గోల్డెన్ బ్లడ్ ను పట్టుకు రావడానికి ప్రపంచమంతా తిరగాల్సి ఉంటుంది.
గోల్డెన్ బ్లడ్... పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైంది.  ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూపు అసలు పేరు ఆర్‌హెచ్‌ నల్ (Rh null). ఈ రక్తం ఎందుకంత ప్రత్యేకం? దీన్ని బంగారంతో ఎందుకు పోల్చుతారు? ఈ రక్తం కలిగి ఉండటం ఎందుకు ప్రమాదకరం? ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే, ముందుగా మన బ్లడ్ గ్రూపులు ఏ, బీ, ఏబీ, ఓ లను ఎలా వర్గీకరించారో తెలుసుకోవాలి.
సాధారణంగా మన రక్తంలోని రక్త కణాలకు యాంటీజెన్ అనే ప్రోటీన్ పూత ఉంటుంది. '' గ్రూపు రక్తంలో యాంటీజెన్ ఏ ఉంటుంది. 'బీ' గ్రూపు రక్తంలో యాంటీజెన్ బీ, ఏబీ గ్రూపు రక్తంలో ఏ, బీ రెండు యాంటీజెన్లు ఉంటాయి. ఓ గ్రూపులో ఏ, బీ యాంటీజెన్లు రెండూ ఉండవు. అలాగే ఎర్ర రక్త కణాలు 61 Rh రకానికి చెందిన RhD అనే మరో యాంటీజెన్‌ను కూడా కలిగి ఉంటాయి. రక్తంలో RhD ఉంటే + (పాజిటివ్), లేకుంటే - (నెగెటివ్) అంటారు. గోల్డెన్ బ్లడ్ గా పిలుస్తోన్న Rh null అనే అరుదైన గ్రూపు రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో Rh యాంటీజెన్ ఉండదు. వైద్య పరిశోధనల వివరాలను అందించే వెబ్‌సైట్ మొజాయిక్‌లో ప్రకారం, ఈ బ్లడ్ గ్రూపును తొలిసారిగా 1961లో ఆస్ట్రేలియాకు చెందిన మహిళలో గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో 43 మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది.
గోల్డెన్ బ్లడ్ రావడం అనేది వంశపారంపర్యంగానే జరుగుతుందని, దీనికి వారి తల్లిదండ్రులిద్దరూ కారణమవుతారని కొలంబియా జాతీయ విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న పరిశోధకులు వివరించారు. బంగారంలాంటి ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది. అలాగే ఈ రక్తాన్ని కలిగి ఉండటం అనేది ప్రమాదం కూడా. ఎందుకంటే ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని. ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికిపట్టుకోవడం కష్టం. ఒకవేళ దాత దొరికినా అరుదైన తమ రక్తాన్ని దానం చేసేందుకు వాళ్లు ముందుకు రాకపోవచ్చు.

No comments: